Congress has no Plans to Employment by Pullarao Pentapati

కాంగ్రెస్ ఉపాధి…‘కల్పనే’!

Pullarao Pentapati

కేంద్ర ప్రభుత్వం వద్ద 10 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన ఆలోచనలు, పథకాలు ఏవీ లేవు. ఇలాంటి మాటలు చెవికింపుగా ఉంటాయి. అందుకే చిదంబరం, జైరాం రమేశ్ వంటి వారు ఇలాంటి కబుర్లు చెబుతుంటారు. వాస్తవానికి గత ఐదేళ్లలో యూపీఏ సర్కార్ కోటి కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ‘కొత్త ఆలోచనల’తో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తన మేనిఫెస్టోను ప్రకటించింది.   దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని కూడా కాంగ్రెస్ నాయకులు హామీలు గుప్పించారు. అయితే గతంలో చేసిన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చలేకపోయారో మాత్రం వారు సమాధానమివ్వలేకపోయారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావంతో గత ఐదేళ్లుగా వృద్ధిరేటు దిగజారుతున్నప్పుడు సమీప భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రజలను నమ్మబలికించేందుకు కాంగ్రెస్ ఎందుకు ఆపసోపాలు పడుతోంది?

ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల పేరిట ఎంతో హడావుడి చేస్తాయి. పోలింగ్ అయ్యాక వాటి సంగతి మర్చిపోతాయి. తమిళనాడులో గతంలో డీఎంకే పార్టీ ఓటర్లకు ‘అన్నీ ఉచితం’ అంటూ ఊరించింది. వంటసామాన్లు, మిక్సర్లు, ఫ్యాన్లు, టీవీలు వంటివి  ఇచ్చింది. కాని ప్రజలు తెలివైనవారు. డీఎంకే పార్టీ పట్ల కృతజ్ఞత చూపకపోగా తమను అవినీతిలో భాగస్వామ్యం చేసిందని, అస్తవ్యస్త పరిపాలన సాగించిందని భావించారు. దాని ఫలితంగా 2011 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు డీఎంకేను చిత్తుచిత్తుగా ఓడించారు. సాధారణంగా తాము అధికారంలోకి రాలేమని భావించినప్పుడు పార్టీలు అసాధ్యమైన వాగ్దానాలు చేస్తాయి. మామూలుగా పార్టీలు నగదు బహుమతులు, కులపరంగా రిజర్వేషన్లు వంటి హామీలు ఇస్తుంటాయి. ఇలాంటి వాగ్దానాలు చేసిన తర్వాత సమర్థవంతమైన, నిజాయితీవంతమైన ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదు. సామాజిక న్యాయం పేరిట రాజకీయ పార్టీలు వాగ్దానాల సంతర్పణ చేస్తుంటాయి. ఇలా అలవికాని వాగ్దానాలను గుప్పించడం భావ్యమా?

2009 ఎన్నికలలో తామిచ్చిన వాగ్దానాలలో 90 శాతం హామీలను నెరవేర్చామని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. దాదాపు 90 శాతం వాగ్దానాలను యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందని ప్రజలు భావిస్తుంటే పోల్ సర్వేలలో కాంగ్రెస్ ఎందుకు వెనుకబడి ఉందో చెప్పాలి? ఎంత సుదీర్ఘమైన మేనిఫెస్టోను ఓటర్ల ముందు ఉంచితే ఓట్ల డబ్బాలలో అంత భారీగా ఓట్లు రాలుతాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలవేళ పాత మేనిఫెస్టోను ప్రకటించడం కాదు, దానిలో చేసిన వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేయడం అత్యంత ప్రధానమని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించాలి. కాంగ్రెస్‌లో ఇలాంటి పనులు చేసే నాయకులు లేరు.

సమీప భవిష్యత్తులో 8 శాతం వృద్ధి రేటు సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు. అయితే గత ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించకపోవడానికి గల కారణాలను పార్టీ వివరించలేదు. ఇక మతకలహాల వ్యతిరేక బిల్లు విషయానికి వస్తే…. దీనిపై అన్ని పార్టీలూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీలో మెజారిటీ మతస్తులకు దీనిపై అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అనేక కారణాల వల్ల కేంద్రం దీన్ని ఇంతవరకూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదు.

ఊరించే ఉద్యోగాలు!

పది కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న వాగ్దానం వివాదాస్పదంగా మారింది. ఇదెలా సాధ్యమని అనేకమంది నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి మార్కెట్లోకి ఏటా రెండు కోట్లమంది యువతీయువకులు వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఒకవేళ ఇది సాధ్యమైతే ప్రభుత్వం గత ఐదేళ్లు కలుపుకొని ఒక కోటి ఉద్యోగాలను ఎందుకు ఇవ్వలేకపోయింది? ఏమీ పనిచేయని వారికి కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.120 చొప్పున చెల్లించిన ‘ఘనత’ ఈ సర్కారుది. ఇలాంటి పథకాల వల్ల కొత్త ఉద్యోగాలు ఏవీ రావు. ప్రభుత్వం వద్ద 10 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందు కు తగిన ఆలోచనలు, పథకాలు ఏవీ లేవు. ఇలాంటి మాటలు చెవికింపుగా ఉంటాయి. అందుకే చిదంబరం, జైరాం రమేశ్ వంటి వారు ఇలాం టి కబుర్లు చెబుతుంటారు. వాస్తవానికి గత ఐదేళ్లలో యూపీఏ సర్కార్ ఒక కోటి కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది. పది కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తామో, ధరలను ఎలా అదుపు చేయగలమో కాంగ్రెస్ నేతలు ఈ మేనిఫెస్టోలో చెప్పలేకపోయారు. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. గత పదేళ్లలో దాదాపు రెండు లక్షలమందిదాకా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అనధికార అంచనా. వ్యవసాయ సంక్షోభం, రైతుల దీనావస్థ గురించి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అసలు ప్రస్తావన చేయలేదు.

చిత్తశుద్ధిలేని అవినీతి పోరు

అవినీతిని అంతమొందించేందుకు ఇప్పుడు ఉన్న చట్టాలు చాలవన్నట్టు ఇంకా అనేక కొత్త చట్టాలు తీసుకువస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు పాత్ర ఉన్న ఆదర్శ్ కుంభకోణం, రైల్వే పోస్టులు అమ్ముకున్న మాజీ రైల్వే మంత్రి పవన్ బన్సల్ అవినీతి గురించి తీసుకున్న చర్యల గురించి ఏమీ వివరణ ఇవ్వలేదు. పెపైచ్చు కాంగ్రెస్ అవినీతి కళంకిత చవాన్‌కు నాందేడ్ లోక్‌సభ టికెట్ మళ్లీ ఇవ్వడం కొసమెరుపు. మావోయిస్టులను అణచివేస్తామని, పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అగ్రవర్ణాలలో పేదలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చే ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఇది దేశంలో వివిధ కులాల మధ్య విభేదాలను మరింత పెంచేందుకు దారితీయవచ్చని భావిస్తున్నారు. ఓటు బ్యాంకు సృష్టించుకోవాలన్న వ్యూహంలో ఉన్న కాంగ్రెస్ తమను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీరియస్‌గా ఆలోచించుకోవల్సిన సమయం ఆసన్నమయ్యింది. పూర్వాశ్రమంలో ఒక టీ స్టాల్ నడుపుకున్న ఒక సాదాసీదా వ్యక్తి (నరేంద్ర మోడీ) తమకు సవాలు విసరగలిగే స్థాయికి ఎదగడం గురించి ఆలోచించాలి. అంతేకాదు… మోడీ సర్కారును ఏర్పాటు చేస్తారా, చేయరా అన్న మాట అటుంచితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితులు ఆయన సృష్టించడం గురించి కూడా వారు ఆలోచిం చాలి. కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికైనా తన మేనిఫెస్టోను పక్కన పెట్టి, టీవీ షోలు, ప్రచారానికి దూరంగా ఉండి, తన తప్పిదాలను అంగీకరించి ప్రజాపాలన అసలు కిటుకు ఏమిటో తెలుసుకోవాలి. నిజాయితీ పాలన అందించిన రోజున పాలకులు చేసిన తప్పులను మన్నించేందుకు ప్రజలు సదా సిద్ధంగా ఉంటారు. కాని మీడియా ప్రచారపటాటోపం, ప్రాపగాండా ద్వారా కాంగ్రెస్ ఎన్నికల వైతరణి దాటాలనుకుంటోంది. అదే ఆ పార్టీ చేస్తున్న తప్పు.

పెంటపాటి పుల్లారావు, (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s