BJP Should Change Strategy to take Advantage – Pullarao Pentapati

Pullarao Pentapati
 ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహం మార్చుకుంటే, తొలి పాచిక  వేసిన ప్రయోజనం (పయెనీర్ అడ్వాంటేజ్) బీజేపీకి లభిస్తుంది. 1996లో వాజపేయికి ఎదురైన చేదు అనుభవం మోడీకి ఎదురుకాకుండా చేసేందుకు బీజేపీ యోచించాలి. దీనికి సమైక్య ఆంధ్రప్రదేశ్ వ్యూహం పనికి వస్తుందేమో ఆ పార్టీ పరిశీలించాలి.

చరిత్రను విస్మరించేవాడు చారి త్రక తప్పిదాలు చేయక తప్ప దని అమెరికన్ తత్వవేత్త జార్జ్ సాంతాయన అంటాడు. కొన్ని చారిత్రక ఘటనలను గుర్తుంచు కోవలసిందే. గతాన్ని గుర్తు చేసు కోవడమంటే జరిగిన పొర పాట్లు మళ్లీ మళ్లీ చేయకుండా జాగ్రత్తపడటం. దేశ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమైన శక్తి. 2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ బలం 116 స్థానా లకు పడిపోయింది. కానీ పదేళ్లలో కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం వల్ల బీజేపీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నట్లుంది. నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక పార్టీ కార్య కర్తలలో ఉత్సాహం పెరిగింది. కొత్త ఓటర్లు ఆకర్షితుల వుతున్నారు. ఏదయినా పార్టీ అధికారంలోకి రావాలంటే కొత్త ఓటర్లను ఆకట్టుకోవాలి. మోడీతో దేశమంతా ఆ పని జరిగింది. ఇదే ఆంధ్రప్రదేశ్‌లోనూ జరగాలి. 2009 ఎన్ని కలలో బీజేపీ రాష్ట్ర అసెంబ్లీకి ఇద్దరు ఎమ్మెల్యేలను పం పింది. ఈ పార్టీకి పోలైన ఓట్లు మూడు శాతమే. లోక్ సభకు పోటీ చేసిన వాళ్లంతా, సికింద్రాబాద్‌లో తప్ప, ధరావతు కోల్పోయారు.

 జీరో అయినా…
అయినా ఇక్కడ జరిగే రాజకీయ చర్చల్లో బీజేపీ ప్రస్తావన విధిగా ఉండడానికి కారణం, పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థించడమే. 116 లోక్‌సభ స్థానాలూ, 54 రాజ్యసభ స్థానాలూ ఉన్న బీజేపీ తెలంగాణ మీద తీసుకునే నిర్ణయానికి ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఈ విషయంలో బీజేపీది చిత్రమైన పరిస్థితి. మద్దతు ఇస్తున్నా తెలంగా ణను తీసుకొచ్చే స్థితిలోలేదు. తలుచుకుంటే, తెలంగాణ ను ఆపే శక్తి మాత్రం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జీరో అయినా, రాష్ట్ర భవిష్యత్తును శాసించే స్థితి ఉండటం విశేషం. అందుకే పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వచ్చిన ప్పుడు బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే విషయా న్ని తెలంగాణ అనుకూలురు, వ్యతిరేకులు కూడా చర్చిస్తు న్నారు. ఈ అంశాన్ని మొదటి నుంచి సమర్థిస్తున్నామని, ఇప్పుడు వెనక్కు వెళ్లలేనని చెప్పి పార్లమెంటులో బిల్లును సమర్థిస్తే, బీజేపీకి మేలుకు బదులు రాజకీయంగా నష్టం జరుగుతుంది. అందువల్ల బిల్లు మీద తుది నిర్ణయం తీసు కునే ముందు ఆగస్టు 1 తర్వాత సీమాంధ్ర ప్రాంతాలలో చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, తెలంగాణలో పార్టీకి వచ్చే ప్రయోజనాన్ని బేరీజు వేసుకోవడం అవసరం. తెలంగాణ మీద తమ వైఖరి కాంగ్రెస్‌కు భారీగా లబ్ధి చేకూర్చగలదన్న విషయాన్ని బీజేపీ విస్మరించరాదు. 1996 అనుభవాన్ని మననం చేసుకుంటే చాలు, 2014 ఎన్నికలలో గెలిచే దారి బీజేపీ కళ్లముందు కనబడుతుంది.

 విస్మరించరాని అనుభవం
రాజకీయ పార్టీలు సంస్థాగత జ్ఞాపకశక్తి (ఇనిస్టిట్యూషనల్ మెమొరి)ని అలవర్చుకోవాలి. గతంలో ఎలాంటి సమస్య లను ఎదుర్కొన్నది, కష్టాలు పడింది, వాటిని ఎలా పరిష్క రించుకున్నది లేదా ఆ సమస్యల్లో తామెలా నలిగిపో యింది రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. ఆ జ్ఞాపకశక్తి తోనే ఈ ముప్పులు తిప్పలు మళ్లీ మళ్లీ ఎదురుకాకుండా తప్పించుకోవచ్చు. 1996లో బీజేపీ మొదటిసారి అధికా రంలోకి ఎలా వచ్చిందో చూద్దాం. అప్పుడు లోక్‌సభలో బీజేపీ బలం 161. శివసేన, సమతా పార్టీ, హర్యానా వికాస్ పార్టీ పార్టీలు బీజేపీతో ఉండేవి. మే 16న రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అటల్ బిహారీ వాజపేయిని ఆహ్వానించారు. పార్లమెంటులో బలం నిరూపించుకోవలసిందిగా పదిహేను రోజుల గడు వు ఇచ్చారు. చిన్నాచితక పార్టీలన్నీ బీజేపీ కార్యాలయా నికి పరిగెత్తుకుంటూ వచ్చి సంకీర్ణ ప్రభుత్వంలో చేర్చు కొమ్మని బారులు తీరతాయని భావించారు. ఒక వర్గం కాంగ్రెస్ ఎంపీలు వలస వస్తారని బీజేపీ నాయకత్వం అత్యాశకుపోయింది.

తీరా బలనిరూపణ కష్టమై, వాజ పేయి 1996 జూన్ ఒకటో తేదీన ప్రధాని పదవికి రాజీ నామా చేయాల్సివచ్చింది. తర్వాత కాంగ్రెస్, వామపక్షా లతో, డిఎంకే, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో జనతాదళ్ నాయకుడు హెచ్‌డీ దేవెగౌడ నాయత్వంలో యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, వామపక్షాలకు కావలసింది 70 మంది ఎంపీలే. అప్పుడు లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్‌జేడీ, ములాయం సింగ్ నాయక త్వంలోని సమాజ్ వాది పార్టీలతో పాటు డీఎంకే, తమిళ మానిళ కాంగ్రెస్‌లు కూడా ఈ కూటమిలో చేరేందుకు ముందుకు వచ్చాయి. బీజేపీ వ్యతిరేక కూటమిని కూడ గట్టడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ఇలా ఏర్పడిన యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదట దేవెగౌడ, తర్వాత ఐకే గుజ్రాల్‌ల నాయకత్వంలో రెండేళ్లకు పైగా కొనసా గింది. అయితే అప్పుడు తమ ప్రభుత్వం పదమూడు రోజులకు మించి ఎందుకు మనుగడ సాగించలేకపో యిందో బీజేపీ మననం చేసుకోవాలి.

 పరిస్థితులు మారాయి
దేశ రాజకీయాలలో కాంగ్రెస్, బీజేపీ తటస్థులనే మూడు రకాల శక్తులున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని రాబోయే రాజకీయ పరిస్థితిని ఒకసారి ఊహించుకుందాం. బీజేపీ అన్నింటికంటే పెద్ద పార్టీగా వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత ఆధిక్యం వచ్చేలా కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపు వస్తే కాంగ్రెసేతర, వామపక్షేతర పార్టీలన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయని ఇప్పుడు కూడా బీజేపీ ఆశిస్తూ ఉంది. అది జరిగే పనికాదు. 1996-98 మధ్య ఎలాంటి వైభవం అనుభవించినదీ తటస్థ పార్టీలేవీ మరిచిపోలేదు. డిఎంకే, తమిళ మానిళ కాంగ్రెస్ పార్టీలకు 14 మంత్రి పదవులు లభిస్తే, లాలూ ప్రసాద్, సీపీఐ, రామ్‌విలాస్ పాశ్వాన్‌లు బీహార్‌కు 16 పదవులు తీసు కెళ్లారు. అందువల్ల మళ్లీ మూడో ఫ్రంట్‌కు కాంగ్రెస్ ప్రాణం పోస్తుందేమోనని తటస్థ పార్టీలన్నీ ఎదురు చూస్తూనే ఉంటాయి. జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు, జయలలిత, నవీన్ పట్నాయక్, నితీష్‌కుమార్, లాలూ, రామ్‌విలాస్ పాశ్వాన్, ములాయంసింగ్, మాయవతి, మమతా బెనర్జీ తటస్థులు. ఇంతవరకు జరిగిన అభి ప్రాయ సేకరణల ప్రకారం వీళ్లందరికీ కలిపి లోక్‌సభలో 175 స్థానాల దాకా రావచ్చు. కాంగ్రెస్ కూడా పూర్తి మెజా రిటీ సాధించలేకపోయినా, అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా నిలవాలని ఆ పార్టీ కలలు కంటూ ఉంది. అలాం టప్పుడు, ఈసారి లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ వంటి దళిత నేతను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి, ఇతర పార్టీల సాయం కోరవచ్చు. కాంగ్రెస్‌కు ఇలాంటి అవకాశం రాకున్నా, నరేంద్రమోడీ ప్రధాని కాకుండా చేసేందుకు ఎత్తుగడ వేయవచ్చు. అలా ప్రభుత్వ ఏర్పాటుకు తటస్థ పార్టీలను ప్రేరేపించవచ్చు. అవసరమైతే, ఆ ప్రభుత్వంలో చేరి సంకీర్ణం ఎక్కువ కాలం మనుగడ సాగించేందుకు ఉపకరించవచ్చు.

 ఎత్తులూ పైఎత్తులూ తప్పవు
ఢిల్లీ పీఠానికి కాంగ్రెస్‌ను దూరంగా ఉంచేందుకు బీజేపీ కూడా ఇలాంటి యోచన చేయవచ్చు. కాంగ్రెసేతర ప్రభు త్వం ఏర్పాటు కావడం, దానికి బీజేపీ బయట నుంచి మద్దతు ఇవ్వడం జరిగే పని కాదు. మెజార్టీ పార్టీ హోదా రాగానే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు వస్తుంది. కానీ తటస్థ పార్టీలు ముందుకు రావు. 2014లో కూడా 1996 పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలు మెం డుగా ఉన్నాయి. నరేంద్రమోడీ వల్ల బీజేపీకి పోలయ్యే ఓట్లు పది శాతం పెరగవచ్చు. ఫలితంగా లోక్‌సభ స్థానా లు 190కి పెరగవచ్చు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇదొ క్కటే చాలదు. గత ఎన్డీయే భాగస్వాములు జయ, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్‌లు మళ్లీ కలుస్తారని బీజేపీ ఆశ. కానీ తమను సమర్థించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నప్పుడు తటస్థ పార్టీలు బీజేపీ వైపు ఎందుకు వస్తాయి?

 ఓ చాణక్యుడు కావాలి
2014లో దారి చూపేందుకు బీజేపీకి ఒక చాణక్యుడో, మాకియవెల్లియో కావాలి. ఎన్నికల అనంతర చారిత్ర ఘటనలు బీజేపీ అదుపులో ఉంటాయనుకోరాదు. కాం గ్రెస్‌ను బీజేపీ తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. తనకు అధికారం రాకపోతే, బీజేపీకి కూడా అధికారం దక్కకుండా చేయడం ఎలాగో చెప్పే ఉపప్రణాళికను ఈసారి కూడా కాంగ్రెస్ సిద్ధం చేసుకునే ఉంటుంది. మోడీ రావడం కంటె బలహీన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే మంచిదని కాంగ్రెస్‌కు తెలుసు. కాంగ్రెస్ లాగా, బీజేపీ కూడా ఉప ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. బీజేపీ, మిత్ర పక్షాలకు కలిపి 225 స్థానాలు వస్తాయనే సందేశం ఎన్ని కల ముందే పార్టీ ప్రజల్లోకి పంపించాలి. ఇలాంటి ఆచరణ సాధ్యమైన ప్రణాళిక సిద్ధంగా ఉంటే జయలలిత, నవీన్ పట్నాయక్‌లను వెనక్కి రప్పించుకోవచ్చు. బీజేపీ మీద ఈ పార్టీలన్నింటికీ విశ్వాసం పెరగాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ వ్యూహం మారాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక 25 స్థానాల మద్దతు సంపాదించగలిగితే జయ, నవీన్ పట్నాయక్‌లు బీజేపీని గౌరవించడం మొదలుపెడతారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహం మార్చుకుంటే, తొలి పాచిక వేసిన ప్రయోజనం (పయెనీర్ అడ్వాంటేజ్)బీజేపీకి లభిస్తుంది. 1996లో వాజపేయికి ఎదురైన చేదు అనుభవం మోడీకి ఎదురుకా కుండా చేసేందుకు బీజేపీ యోచించాలి. దీనికి సమైక్య ఆంధ్రప్రదేశ్ వ్యూహం పనికి వస్తుందేమో ఆ పార్టీ పరిశీలించాలి.
 – డా॥పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు

Source : http://www.sakshi.com/news/opinion/bjp-should-change-strategy-to-take-advantage-83778

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s