Pullarao Pentapati – BJP Gets Political Prize by People Against to Congress

కమలానికి ‘చేతి’ చలువ!

Pullarao Pentapati

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కొత్త శత్రువులను సృష్టించుకుంది. ఇప్పుడు ఆ పార్టీ టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీలతోపాటు టీఆర్‌ఎస్‌తో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఇది బీజేపీకి వరంగా మారుతుంది. కోస్తాలో కూడా ప్రజలు బీజేపీ కన్నా కాంగ్రెస్‌నే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ బీజేపీకి ఊహించని రాజకీయ బహుమతి ఇచ్చింది.

 

బీజేపీకి 2014 సార్వత్రిక ఎన్నికలలో కనీసం 225 సీట్లు వస్తాయని ఏడాది క్రితం ఎవరైనా అంచనా వేసి ఉంటే వారిని చూసి నవ్వుకునేవారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో 225 స్థానాలు గెలుచుకునే స్థాయికి చేరుకుందని అనిపిస్తోంది. లోక్‌సభలో మొత్తం 543 సీట్లకుగాను బీజేపీ సొంతంగా 200 స్థానాలలో విజయం సాధిస్తేగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని విశ్లేషకులు చెపుతుండేవారు. అంతేకాదు, బీజేపీకి మిత్రపక్షాలు దొరకడం కూడా చాలా కష్టమని అనేవారు. కమలనాథులు ఈ అవరోధాన్ని కూడా అధిగమించారు.

బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును పార్టీలో కొంతమంది ప్రతిపాదించినప్పుడు అంతర్గతంగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా తమకన్నా జూనియర్ తమను దాటిపోవడం ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటి అగ్రనేతలు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు. మోడీ సభలకు జనాలు విరగబడి వస్తుంటే అద్వానీ, సుష్మాస్వరాజ్  మీటింగ్‌లు వెలవెలబోయేవి. వీరిద్దరూ పాతతరానికి ప్రతినిధులుగా మిగిలారు. ఈ సవాళ్లను మోడీ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. ఇప్పుడు పార్టీలో ఆయన కత్తికి ఎదురేలేదు.

 రాహుల్‌ది ‘సైడ్‌రోల్’

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఆయన ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా భారీ పబ్లిసిటీ సరంజామాతో ఏఐసీసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ ఎంతో ఖర్చు చేసింది. దీనిలో రాహుల్ అనేక ‘అవతారాలలో’ ఓటర్లకు దర్శనమిస్తారు. మోడీ బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి కాబట్టి ఆయన రాహుల్ శక్తియుక్తుల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాహుల్ ఎక్కడా పత్తా లేకుండా పోయారు. నిజానికి ఈ ఎన్నికల్లో ఆయన ప్రధాన పాత్ర కాకుండా ‘సైడ్‌రోల్’ను పోషిస్తున్నారు. రాహుల్ టీవీలో మాత్రమే కనిపిస్తున్నారు. జనాలు రావడం లేదు కాబట్టి ఆయన కోసం బహిరంగ సభలు ఏర్పాటు చేయడం లేదు. వాస్తవానికి మోడీని ఎదుర్కొనలేక రాహుల్ చతికిలబడ్డారు.

మోడీపై కాంగ్రెస్ చేసిన దుర్మార్గపూరిత ఆరోపణలలో  నిజం ఎంత ఉందో తెలియదు కాని వాటి నుంచి ఆయన బయటపడ్డారు. హస్తినలో అధికారాన్ని కైవసం చేసుకునే రేసులో బీజేపీ… కాంగ్రెస్ కన్నా ముందంజలో ఉంది. యుద్ధంలో విజయం సాధించాలంటే కాలం కలిసొచ్చే సైన్యాధికారులు ఉండాలని నెపోలియన్ చెప్పాడు. బీజేపీలో కూడా ఇపుడు అనేకమంది అదృష్టవంతులైన ‘జనరల్స్’ ఉన్నారు. వారి వల్లనే ఆ పార్టీ ఎన్నికల సంగ్రామంలో ముందుకు దూసుకుపోతోంది.

గత నాలుగేళ్లుగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోని అనేక స్కామ్‌లను మీడియా ఎండగట్టింది. మోడీపై వచ్చిన ఆరోపణలు ప్రజల దృష్టిలో చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కాని యూపీఏ హయాంలో ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అవినీతి స్కామ్‌లలో కొన్ని వేలకోట్ల రూపాయల దాకా అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. వీటితో ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత మరింత తీవ్రతరమై అది బీజేపీకి అయాచిత వరమవుతుంది.

 కొత్త ‘సెక్యులర్’ శక్తులతో పొత్తులు

గుజరాత్ అల్లర్లకు నిరసనగా గతంలో ఎన్‌డీఏకు గుడ్‌బై చెప్పిన ఎల్‌జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ మళ్లీ  ఆగూటికే చేరారు. మోడీ ‘అమాయకుడని’ కోర్టులు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించాయని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు పనిలోపనిగా మోడీని ప్రధానిని చేసేదాకా నిద్రపోనని కూడా శపథం చేశారు. ప్రస్తుత బీహార్ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పాశ్వాన్ రాజకీయ అవసరాలు అలాంటివి. ఏదిఏమైనా ఇది మోడీకి ఊహించని వరమే. ధరల పెరుగుదలను ప్రజలు ఎంతమాత్రం ఇష్టపడరు. ఎందుకంటే అది వారి జేబుకు చిల్లుపెడుతుంది. కానీ గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ విషయంలో ఎంతమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. ఎన్నికల వేళ తాయిలాలు ఇస్తే అవినీతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి విషయాలను ప్రజలు పెద్దగా పట్టించుకోరన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం కాబోలు.

ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తెలంగాణలో 16 ఎంపీ సీట్లు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేసింది. సీట్లు మాట దేవుడెరుగు, కొత్త శత్రువులను సృష్టించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లతో పాటు టీఆర్‌ఎస్‌తో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఈ విభజన ఒకరకంగా బీజేపీకి  వరంగా మారింది. అదేవిధంగా కోస్తాలో కూడా ప్రజలు బీజేపీ కన్నా కాంగ్రెస్‌పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. విభజన ద్వారా కాంగ్రెస్‌పార్టీ బీజేపీకి ఊహించని రాజకీయ బహుమతి ఇచ్చింది. కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలకుతోడు, బీజేపీకి కలిసివచ్చిన అదృష్టంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలనాథులు మరింత చేరువకాగలిగారు. ప్రస్తుతం వెలువడిన పోల్స్ అంచనాలు పూర్తిగా వాస్తవం కాకపోవచ్చుగానీ, ఎన్నికలు జరగడానికి ఇంకా 60 రోజుల వ్యవధి ఉంది. ఈలోగా అనేక మార్పులు జరగవచ్చు కూడా.

 ‘ఆప్’ నుంచి ముప్పు

బీజేపీకి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో గట్టి పట్టు ఉంది. కాని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఈ వర్గాల ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఆప్ రంగంలో లేకుంటే ఈ ఓట్లన్నీ బీజేపీకే పడతాయి. కొత్తగా ఆప్ రావడం వల్ల బీజేపీ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. ఇటీ వలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయాన్ని అడ్డుకున్నది ఆప్ అన్నది మర్చిపోకూడదు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి 15 కన్నా అధికంగా ఎంపీ సీట్లు వస్తాయని ఎవరూ భావించడం లేదు. కాని ‘ఆప్’ బీజేపీకి రావల్సిన సీట్లకే గండికొడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

సార్వత్రిక ఎన్నికలలో ముస్లింలు వ్యూహాత్మకంగా ఓట్లు వేస్తారు. మతతత్వ శక్తులను ఓడించే పార్టీలనే వారు బలపరుస్తారు. బీజేపీని ఆప్ గట్టిగా వ్యతిరేకిస్తోంది కాబట్టి ‘ఆప్’ వారికి అస్త్రంగా ఉపయోగపడనున్నది. బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్‌నూ, కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీ కూడా అవినీతి పార్టీయేనని పేర్కొంటున్న ఆప్‌ను ముస్లింలు బాగా ఇష్టపడతారు. మోడీని ఎదుర్కొనే సత్తా కేజ్రీవాల్‌కు ఉందని వారు విశ్వసిస్తున్నారు.

Pullarao Pentapatiకేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆశలను కాంగ్రెస్ దాదాపుగా వదులుకుంది. అయితే అదే సమయంలో తన ఆగర్భశత్రువు మోడీ ప్రధాని కాకుండా చూసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతుంది. జయలలిత నుంచి ములాయం వరకు, మమత నుంచి శరద్ పవార్ వరకు ఎవరు ప్రధాని అయినా కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బంది లేదు. ప్రాంతీయ పార్టీల నుంచి తగిన సంఖ్యలో ఎంపీలు గెలిస్తే బీజేపీకి మెజారిటీ దక్కదని కాంగ్రెస్ నాయకత్వం ఆశాభావంతో ఉంది. చరిత్ర పునరావృతమవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్ అభ్యంతరం పెట్టదు. గతంలో మాదిరిగా అస్థిర ప్రభుత్వాలు ఏర్పడి గందరగోళ పరిస్థితులు తలెత్తేదాకా ఓపిగ్గా వేచి ఉండి తర్వాత అవి కుప్పకూలినప్పుడు తమ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆ సమయంలో మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతల మనసులో ఉంది. ప్రస్తుతానికి బీజేపీకి అనుకూల గాలి వీస్తోంది. ఇంతవరకు మోడీకి అదృష్టం కలిసి వచ్చింది. కాని అదృష్టంపై మరీ ఎక్కువ ఆధారపడకూడదు.

 (వ్యాసరచయిత రాజకీయ విశ్లేషకులు)
పెంటపాటి పుల్లారావు

Continue reading

Congress has no Plans to Employment by Pullarao Pentapati

కాంగ్రెస్ ఉపాధి…‘కల్పనే’!

Pullarao Pentapati

కేంద్ర ప్రభుత్వం వద్ద 10 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన ఆలోచనలు, పథకాలు ఏవీ లేవు. ఇలాంటి మాటలు చెవికింపుగా ఉంటాయి. అందుకే చిదంబరం, జైరాం రమేశ్ వంటి వారు ఇలాంటి కబుర్లు చెబుతుంటారు. వాస్తవానికి గత ఐదేళ్లలో యూపీఏ సర్కార్ కోటి కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ‘కొత్త ఆలోచనల’తో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తన మేనిఫెస్టోను ప్రకటించింది.   దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని కూడా కాంగ్రెస్ నాయకులు హామీలు గుప్పించారు. అయితే గతంలో చేసిన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చలేకపోయారో మాత్రం వారు సమాధానమివ్వలేకపోయారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావంతో గత ఐదేళ్లుగా వృద్ధిరేటు దిగజారుతున్నప్పుడు సమీప భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రజలను నమ్మబలికించేందుకు కాంగ్రెస్ ఎందుకు ఆపసోపాలు పడుతోంది?

ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల పేరిట ఎంతో హడావుడి చేస్తాయి. పోలింగ్ అయ్యాక వాటి సంగతి మర్చిపోతాయి. తమిళనాడులో గతంలో డీఎంకే పార్టీ ఓటర్లకు ‘అన్నీ ఉచితం’ అంటూ ఊరించింది. వంటసామాన్లు, మిక్సర్లు, ఫ్యాన్లు, టీవీలు వంటివి  ఇచ్చింది. కాని ప్రజలు తెలివైనవారు. డీఎంకే పార్టీ పట్ల కృతజ్ఞత చూపకపోగా తమను అవినీతిలో భాగస్వామ్యం చేసిందని, అస్తవ్యస్త పరిపాలన సాగించిందని భావించారు. దాని ఫలితంగా 2011 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు డీఎంకేను చిత్తుచిత్తుగా ఓడించారు. సాధారణంగా తాము అధికారంలోకి రాలేమని భావించినప్పుడు పార్టీలు అసాధ్యమైన వాగ్దానాలు చేస్తాయి. మామూలుగా పార్టీలు నగదు బహుమతులు, కులపరంగా రిజర్వేషన్లు వంటి హామీలు ఇస్తుంటాయి. ఇలాంటి వాగ్దానాలు చేసిన తర్వాత సమర్థవంతమైన, నిజాయితీవంతమైన ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదు. సామాజిక న్యాయం పేరిట రాజకీయ పార్టీలు వాగ్దానాల సంతర్పణ చేస్తుంటాయి. ఇలా అలవికాని వాగ్దానాలను గుప్పించడం భావ్యమా?

2009 ఎన్నికలలో తామిచ్చిన వాగ్దానాలలో 90 శాతం హామీలను నెరవేర్చామని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. దాదాపు 90 శాతం వాగ్దానాలను యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందని ప్రజలు భావిస్తుంటే పోల్ సర్వేలలో కాంగ్రెస్ ఎందుకు వెనుకబడి ఉందో చెప్పాలి? ఎంత సుదీర్ఘమైన మేనిఫెస్టోను ఓటర్ల ముందు ఉంచితే ఓట్ల డబ్బాలలో అంత భారీగా ఓట్లు రాలుతాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలవేళ పాత మేనిఫెస్టోను ప్రకటించడం కాదు, దానిలో చేసిన వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేయడం అత్యంత ప్రధానమని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించాలి. కాంగ్రెస్‌లో ఇలాంటి పనులు చేసే నాయకులు లేరు.

సమీప భవిష్యత్తులో 8 శాతం వృద్ధి రేటు సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు. అయితే గత ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించకపోవడానికి గల కారణాలను పార్టీ వివరించలేదు. ఇక మతకలహాల వ్యతిరేక బిల్లు విషయానికి వస్తే…. దీనిపై అన్ని పార్టీలూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీలో మెజారిటీ మతస్తులకు దీనిపై అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అనేక కారణాల వల్ల కేంద్రం దీన్ని ఇంతవరకూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదు.

ఊరించే ఉద్యోగాలు!

పది కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న వాగ్దానం వివాదాస్పదంగా మారింది. ఇదెలా సాధ్యమని అనేకమంది నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి మార్కెట్లోకి ఏటా రెండు కోట్లమంది యువతీయువకులు వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఒకవేళ ఇది సాధ్యమైతే ప్రభుత్వం గత ఐదేళ్లు కలుపుకొని ఒక కోటి ఉద్యోగాలను ఎందుకు ఇవ్వలేకపోయింది? ఏమీ పనిచేయని వారికి కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.120 చొప్పున చెల్లించిన ‘ఘనత’ ఈ సర్కారుది. ఇలాంటి పథకాల వల్ల కొత్త ఉద్యోగాలు ఏవీ రావు. ప్రభుత్వం వద్ద 10 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందు కు తగిన ఆలోచనలు, పథకాలు ఏవీ లేవు. ఇలాంటి మాటలు చెవికింపుగా ఉంటాయి. అందుకే చిదంబరం, జైరాం రమేశ్ వంటి వారు ఇలాం టి కబుర్లు చెబుతుంటారు. వాస్తవానికి గత ఐదేళ్లలో యూపీఏ సర్కార్ ఒక కోటి కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది. పది కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తామో, ధరలను ఎలా అదుపు చేయగలమో కాంగ్రెస్ నేతలు ఈ మేనిఫెస్టోలో చెప్పలేకపోయారు. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. గత పదేళ్లలో దాదాపు రెండు లక్షలమందిదాకా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అనధికార అంచనా. వ్యవసాయ సంక్షోభం, రైతుల దీనావస్థ గురించి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అసలు ప్రస్తావన చేయలేదు.

చిత్తశుద్ధిలేని అవినీతి పోరు

అవినీతిని అంతమొందించేందుకు ఇప్పుడు ఉన్న చట్టాలు చాలవన్నట్టు ఇంకా అనేక కొత్త చట్టాలు తీసుకువస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు పాత్ర ఉన్న ఆదర్శ్ కుంభకోణం, రైల్వే పోస్టులు అమ్ముకున్న మాజీ రైల్వే మంత్రి పవన్ బన్సల్ అవినీతి గురించి తీసుకున్న చర్యల గురించి ఏమీ వివరణ ఇవ్వలేదు. పెపైచ్చు కాంగ్రెస్ అవినీతి కళంకిత చవాన్‌కు నాందేడ్ లోక్‌సభ టికెట్ మళ్లీ ఇవ్వడం కొసమెరుపు. మావోయిస్టులను అణచివేస్తామని, పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అగ్రవర్ణాలలో పేదలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చే ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఇది దేశంలో వివిధ కులాల మధ్య విభేదాలను మరింత పెంచేందుకు దారితీయవచ్చని భావిస్తున్నారు. ఓటు బ్యాంకు సృష్టించుకోవాలన్న వ్యూహంలో ఉన్న కాంగ్రెస్ తమను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీరియస్‌గా ఆలోచించుకోవల్సిన సమయం ఆసన్నమయ్యింది. పూర్వాశ్రమంలో ఒక టీ స్టాల్ నడుపుకున్న ఒక సాదాసీదా వ్యక్తి (నరేంద్ర మోడీ) తమకు సవాలు విసరగలిగే స్థాయికి ఎదగడం గురించి ఆలోచించాలి. అంతేకాదు… మోడీ సర్కారును ఏర్పాటు చేస్తారా, చేయరా అన్న మాట అటుంచితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితులు ఆయన సృష్టించడం గురించి కూడా వారు ఆలోచిం చాలి. కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికైనా తన మేనిఫెస్టోను పక్కన పెట్టి, టీవీ షోలు, ప్రచారానికి దూరంగా ఉండి, తన తప్పిదాలను అంగీకరించి ప్రజాపాలన అసలు కిటుకు ఏమిటో తెలుసుకోవాలి. నిజాయితీ పాలన అందించిన రోజున పాలకులు చేసిన తప్పులను మన్నించేందుకు ప్రజలు సదా సిద్ధంగా ఉంటారు. కాని మీడియా ప్రచారపటాటోపం, ప్రాపగాండా ద్వారా కాంగ్రెస్ ఎన్నికల వైతరణి దాటాలనుకుంటోంది. అదే ఆ పార్టీ చేస్తున్న తప్పు.

పెంటపాటి పుల్లారావు, (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)

Continue reading